GUNTUR CITY NEWS: స్వచ్ఛతా హి సేవా’లో భాగంగా ప్రజారోగ్య రక్షకులైన పారిశుధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరం.

Karthik

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమం, నవ గుంటూరులో భాగంగా నగర శుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే నగరం పరిశుభ్రంగా ఉంటుందనే సంకల్పంతో వెల్ నెస్ స్వచ్చ వారియర్స్ పేరుతో గుంటూరు నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది, వారి కుటుంబ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేకంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను నిర్వహించామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో గుంటూరు నగరం రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిందని, పారిశుధ్య కార్మికులు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, వార్డు కార్యదర్శుల అహర్నిశల కృషి, నిరంతర శ్రమ వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో గుంటూరు నగరానికి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంక్ సాధించడమే ధ్యేయంగా సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మెగా వైద్య శిబిరంలో జిఎంసికి చెందిన 2,500 మంది ప పారిశుధ్య కార్మికులు, 1,000కి పైగా ఇంజనీరింగ్ విభాగ సిబ్బందితో కలిపి మొత్తం 3500 మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తో పాటు నగరంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రుల ఉమ్మడి సహకారంతో ఈ క్యాంప్‌ లో న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ సహా మొత్తం 15 రకాల ప్రత్యేక వైద్య విభాగాలకు చెందిన దాదాపు 40 మంది నిపుణులైన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి తగిన సలహాలు, సూచనలు అందింస్తారన్నారు.ముందస్తు వ్యాధి నిర్ధారణ – ఉచిత శస్త్రచికిత్సలు: వయస్సు పైబడటం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, దృష్టి లోపాలను ముందస్తుగానే గుర్తించి నివారించడమే లక్ష్యంగా ఈ ఫాలో-అప్ క్యాంప్ సాగిందన్నారు. శిబిరంలో భాగంగా 50కి పైగా రకాల రాపిడ్ బ్లడ్ టెస్ట్‌లు, ఈసీజీ, కంటి పరీక్షలను ఉచితంగా చేస్తారని తెలిపారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన సిబ్బందిలో క్యాటరాక్ట్ (కంటి శుక్లాలు) సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయితే, వారికి ఈఎస్ఐ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు తదుపరి వైద్య సహాయాన్ని అందించేందుకు తగిన సిఫార్సులు చేయడం జరుగుతుందన్నారు.సమర్థవంతమైన నిర్వహణ: వైద్య శిబిరానికి వేలాదిగా తరలివచ్చిన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట లేదా రద్దీ లేకుండా ప్రశాంత వాతావరణంలో వైద్య పరీక్షలు జరిగేలా నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ప్రతి ఒక్కరికీ టోకెన్ విధానాన్ని అమలు చేస్తూ క్యూ లైన్ల ద్వారా క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించారు.అనంతరం కమిషనర్ కార్మికులతో నేరుగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని, కార్మికుల సంక్షేమానికి జిఎంసి కట్టుబడి ఉందని తెలిపారు.అలాగే మెడికల్ క్యాంప్ లో పాల్గొని వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి జిఎంసి నుండి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ విష్ణు, డిఈఈ వెంకటరమణ, ఎస్ఎస్ లు, ప్రజారోగ్య అధికారులు, వివిధ హాస్పిటల్స్ నుండి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review