ఆంధ్రప్రదేశ్:-రాష్ట్రంలో నవంబర్ 1న నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై ఎన్టీఆర్ కళాపీఠం హర్షం వ్యక్తం చేసింది. కూటమి పార్టీల ఐక్యత, నాయకుల సమష్టి కృషి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపారని ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకుడు, రచయిత చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించిన పోలీస్ శాఖకు, హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పరిరక్షించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో సమన్వయంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విజయవాడ, పులివెందుల ఫలితాలపై ప్రత్యేక చర్చ
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తయితే, విజయవాడ నగరపాలక సంస్థ, పులివెందుల మున్సిపాలిటీ ఫలితాలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయని చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీశాయని తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ చరిత్రను ప్రస్తావిస్తూ.. బెజవాడ గ్రామపంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా, అనంతరం 1981 జూన్ 6న నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిందని వివరించారు. నగరపాలక సంస్థ ఏర్పాటైన తర్వాత తొలి మేయర్‌గా తాడిపాక వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారని గుర్తుచేశారు.
పులివెందులలో కూటమి విజయంపై హర్షం
కడప జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గీతాకుమారి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం కూటమికి గొప్ప విజయమని చండ్ర ప్రసాద్ అభివర్ణించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం ముగ్గురు కౌన్సిలర్లకే పరిమితం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు.
పులివెందులలో పార్టీ విజయానికి కృషి చేసిన శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషిని అభినందించారు. కడప నగరపాలక సంస్థతో పాటు పులివెందుల మున్సిపాలిటీని కూటమి కైవసం చేసుకోవడం సమిష్టి విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
విజయవాడలో వంగవీటి రాధాకు భారీ ఆధిక్యం
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధా 2,65,888 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారని తెలిపారు. మొత్తం 4,46,021 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు కేవలం 4.75 శాతం ఓట్లు మాత్రమే లభించాయని పేర్కొన్నారు.
సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డీజీపీ స్థాయికి ఎదిగిన ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ప్రజల మద్దతు ఆశించిన స్థాయిలో పొందలేకపోయారని విశ్లేషించారు. రాజకీయాల్లోకి ప్రవేశించే వారు ప్రజల అభిప్రాయాలు, రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని సూచించారు.
చంద్రబాబు నాయకత్వంపై ప్రజల విశ్వాసం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. అటువంటి నాయకత్వంపై పదేపదే విమర్శలు చేయడం విజయవాడ ప్రజలకు నచ్చలేదని, ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారని అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో విమర్శలకు స్థానం ఉన్నప్పటికీ అవి నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.Palnadu District News
కూటమి నాయకులకు ఎన్టీఆర్ కళాపీఠం అభినందనలు
విజయవాడలో కూటమి విజయానికి కృషి చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎన్టీఆర్ కళాపీఠం తరఫున అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో ఐక్యతతో పనిచేసి విజయాన్ని అందించిన కూటమి నాయకత్వానికి వందనాలు సమర్పించారు. ఎన్టీఆర్ కళాపీఠం గౌరవ సలహాదారు ఇప్పిలి శైలజకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మేరకు ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకుడు, రచయిత చండ్ర ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.



