గుంటూరు: భారత తపాలా శాఖను ప్రపంచ స్థాయి సేవా సంస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత సంస్కరణలు అమలు చేస్తోందని కేంద్ర కమ్యూనికేషన్స్ & గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునీకరించిన కొత్తపేట, చంద్రమౌళి నగర్ సబ్ పోస్టాఫీసులను శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరువగా ఉన్న ఏకైక ప్రభుత్వ వ్యవస్థ పోస్టల్ శాఖేనని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఈ శాఖ కీలక పాత్ర పోషించబోతోందని మంత్రి పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల్లో పోస్టల్ శాఖలో జరిగిన మార్పులు గత రెండు నుంచి మూడు దశాబ్దాల్లో జరగని స్థాయిలో ఉన్నాయని, సరైన నాయకత్వం, సాంకేతికత, దూరదృష్టితో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రపంచ స్థాయి సేవలు అందించగలవని నిరూపించామని అన్నారు.
పోస్టల్ శాఖను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆదాయం పెరిగితేనే ఉద్యోగుల సంక్షేమం, సేవల ఆధునికీకరణ, కొత్త సేవల విస్తరణ సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ రంగానికి ఏమాత్రం తీసిపోరని, పోస్టల్ ఉద్యోగులు తమ సేవా దృక్పథం, అంకితభావంతో నిరూపిస్తున్నారని కొనియాడారు.
గ్రామీణ భారతాన్ని పూర్తిగా డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావడంలో పోస్టల్ శాఖ ప్రధాన భూమిక పోషిస్తోందని, డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందని తెలిపారు. గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులు, రైతులు తయారు చేసే ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, విదేశాలకు చేర్చే సామర్థ్యం పోస్టల్ శాఖకు ఉందన్నారు.
లాజిస్టిక్స్ రంగంలో విస్తృత సంస్కరణలు చేపట్టామని, ఆధునిక ప్యాకేజింగ్‌తో పాటు ONDC, GeM, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, పతంజలి వంటి సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 నుంచి 48 గంటల్లో పార్సెల్ డెలివరీ, ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్, ఎస్‌ఎంఎస్ అలర్ట్స్, ఓటీపీ డెలివరీ, జియో ట్యాగింగ్ వంటి సేవలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ పార్సెల్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు DHLతో భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నామని, గ్రామం నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా తక్కువ సమయంలో పార్సెల్ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 80 శాతం పోస్టల్ లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని, త్వరలో పూర్తిస్థాయి క్యాష్‌లెస్ పోస్టాఫీసుల దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఆధార్, పాస్‌పోర్ట్ సేవలు, విస్తరించిన కార్యాలయ సమయాలు, శనివారం అపాయింట్‌మెంట్ సౌకర్యాల ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నామని వివరించారు.
పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు అత్యంత భద్రమైనవని, అధిక వడ్డీ కలిగినవని పేర్కొంటూ ప్రతి ఇంటికీ ఈ సేవలను చేరవేసే లక్ష్యంతో సాచురేషన్ విధానంలో పనిచేస్తున్నామని చెప్పారు. సైలెంట్ ఖాతాలను తిరిగి యాక్టివ్ చేస్తూ వేలాది మంది ఖాతాదారులను మళ్లీ పోస్టల్ సేవలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు.
ఐటీ 2.0 ద్వారా సేవింగ్స్, ఇన్సూరెన్స్ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నామని, యువతను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా జెన్-జీ పోస్టాఫీసులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తొలిసారిగా ప్రైవేట్ రంగ నిపుణులతో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వ్యవస్థను ప్రవేశపెట్టి పోస్టల్ శాఖను కార్పొరేట్ స్థాయి సామర్థ్యాలతో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
ఉద్యోగుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్, ఆధునిక శిక్షణ కార్యక్రమాలు, కస్టమర్ సెంట్రిక్ విధానాలతో సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది పోస్టాఫీసులను దశలవారీగా ఆధునీకరిస్తూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
పోస్టల్ శాఖ ఆస్తులను సమర్థవంతంగా వినియోగిస్తూ కో-వర్కింగ్ స్పేస్‌లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోస్టల్ ఉద్యోగులు ప్రతి ఇంటికీ చేరి సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల ద్వారా లక్షలాది బాలికల భవిష్యత్తు బలోపేతం అవుతోందని, రైతులు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్‌కు చేరవేసే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
గతంలో పోస్టల్ శాఖ ఆదాయం సంవత్సరానికి సుమారు రూ.200 కోట్ల మేర మాత్రమే పెరిగేదని, సంస్కరణల ఫలితంగా ఒక్క సంవత్సరంలోనే రూ.2,100 కోట్లకు పైగా ఆదాయం పెరిగిందని వెల్లడించారు. పోస్టల్ శాఖను దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన, అత్యంత ఆధునికమైన, ప్రజలకు అత్యంత చేరువైన సేవా సంస్థగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.



