చీరాల, అక్టోబర్ 8:– క్వాంటం టెక్నాలజీస్, క్వాంటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో విద్యార్థులు, అధ్యాపకులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాల మరియు అమరావతికి చెందిన కూరియం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు.
ఈ ఒప్పందం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులకు క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం-ఏఐ, ఆధునిక క్వాంటం ఆర్కిటెక్చర్లపై శిక్షణ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ ల్యాబొరేటరీ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు తెలిపారు.
విద్యా రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పారిశ్రామిక అవసరాలకు అనుసంధానం చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని ఐటీ విభాగాధిపతి డా. ఎస్. ఇంద్రనీల్ తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ స్థాయి క్వాంటం టెక్నాలజీలపై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు వాస్తవ ప్రపంచ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.Bapatla District City News
ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులకు ఆన్లైన్ వెబ్నార్లను నిర్వహించారు. బెంగళూరు యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్ డా. కె.ఆర్. వేణుగోపాల్, ఐబీఎం ప్రతినిధులు భన్వర్ గుప్త, డా. రితాజిత్ మజూమ్దార్ తదితరులు వెబ్నార్ల ద్వారా క్వాంటం టెక్నాలజీ, క్వాంటం ఏఐపై అవగాహన కల్పించారు.
కూరియం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ డా. కొల్లా భాను ప్రకాష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్య ప్రారంభ దశ నుంచే విద్యార్థుల్లో అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు వాస్తవ ప్రపంచ ప్రాజెక్టులు, సంయుక్త పరిశోధనా పత్రాల ప్రచురణలు, అంతర్జాతీయ క్వాంటం ప్లాట్‌ఫామ్‌లపై ఓపెన్ సోర్స్ ఆవిష్కరణలు చేపట్టేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా. సి. సుబ్బారావు, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాథ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



