అమరావతి, ఆగస్టు 24:– రాష్ట్రంలో సుబాబుల్, యూకలిప్టస్ వంటి అగ్రో-ఫారెస్ట్రీ పంటలను సాగు చేస్తున్న రైతులకు జీఎస్టీ నుంచి రాయితీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర టెక్స్‌టైల్స్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సోమవారం వేర్వేరుగా లేఖలు రాశారు.
వెస్ట్ వుడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు పలువురు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు సమర్పించిన వినతిపత్రం ఆధారంగా లంకా దినకర్ ఈ అంశాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు తమ సొంత వ్యవసాయ భూముల్లో శ్రమ, పెట్టుబడులు, వనరులను వినియోగించి సుబాబుల్, యూకలిప్టస్ వంటి అగ్రో-ఫారెస్ట్రీ పంటలను సాగు చేస్తున్నారని, వీటిని ప్రధానంగా పేపర్, పల్ప్ పరిశ్రమలకు ముడి పదార్థంగా సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.
అగ్రో-ఫారెస్ట్రీ వల్ల పర్యావరణ పరిరక్షణ, నేల సారవంతత పెంపు, చెట్ల పెంపకం వంటి ప్రయోజనాలు కలుగుతున్నప్పటికీ, ప్రస్తుత జీఎస్టీ విధానం రైతులపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని FPOలు ఆందోళన వ్యక్తం చేశాయి. సుబాబుల్, యూకలిప్టస్ నుంచి లభించే వుడ్ పల్ప్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, మరోవైపు దిగుమతి చేసుకునే వుడ్ మెటీరియల్ తక్కువ పన్ను భారంతో అందుబాటులో ఉండటంతో దేశీయ రైతుల నుంచి ముడి కలప కొనుగోళ్లపై పేపర్ పరిశ్రమల ఆసక్తి తగ్గుతోందని వివరించాయి.
దీంతో రైతుల వద్ద కలప నిల్వలు పేరుకుపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత జీఎస్టీ భారం కారణంగా రైతులకు లభించే నికర ఆదాయం తగ్గడంతో అగ్రో-ఫారెస్ట్రీ సాగుపై రైతుల్లో నిరుత్సాహం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
2014 జాతీయ అగ్రో-ఫారెస్ట్రీ విధానం అగ్రో-ఫారెస్ట్రీని భారతీయ వ్యవసాయంలో అంతర్భాగంగా గుర్తించిన విషయాన్ని లంకా దినకర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ భూముల్లో రైతులు సాగు చేసే వెదురుకు 2018లో జీఎస్టీ పరంగా పునర్వర్గీకరణ చేసిన అంశాన్ని సుబాబుల్, యూకలిప్టస్ విషయంలోనూ పరిశీలించేందుకు ముందస్తు ఉదాహరణగా FPOలు ప్రస్తావించాయి.
రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలి
సుబాబుల్, యూకలిప్టస్‌ను రైతులు సాగు చేసే వ్యవసాయ ఉత్పత్తులుగా గుర్తించి జీఎస్టీ చట్టం పరిధిలో నిల్ జీఎస్టీ రేటు కల్పించాలని లంకా దినకర్ కోరారు. సమగ్ర పునర్వర్గీకరణపై నిర్ణయం తీసుకునే వరకు తాత్కాలిక ఉపశమనంగా జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే FPOలు, అగ్రో-ఫారెస్ట్రీ రైతులు, పేపర్ పరిశ్రమ, వ్యవసాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి శాశ్వత విధాన రూపకల్పనకు సిఫార్సులు చేయాలని కోరారు. రైతులకు కల్పించే జీఎస్టీ రాయితీని రైతులను ప్రతినిధ్యం వహించే FPOలకు కూడా వర్తింపజేయాలని సూచించారు.
ప్రైవేటు వ్యవసాయ భూముల్లో సాగు చేసే అగ్రో-ఫారెస్ట్రీ పంటలను జీఎస్టీ ప్రయోజనాల కోసం వ్యవసాయ ఉత్పత్తులుగా పరిగణించేలా స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. దీనివల్ల రైతులు, కొనుగోలుదారులకు చట్టపరమైన స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు.
FPOల అంచనాల ప్రకారం ప్రస్తుత జీఎస్టీ భారం వల్ల ఒక్కో రైతుకు ఎకరానికి, ఒక్కో కోతకు సుమారు రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ప్రత్యక్ష నష్టం కలిగే అవకాశం ఉందని లంకా దినకర్ తెలిపారు. దేశీయ ముడి పదార్థాల సరఫరా తగ్గితే పేపర్ పరిశ్రమ దిగుమతులపై మరింత ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని పేర్కొన్నారు.
రైతుల ఆదాయ పరిరక్షణతో పాటు అగ్రో-ఫారెస్ట్రీని ప్రోత్సహించడం, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడం, దేశీయ పేపర్ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల సరఫరాను బలోపేతం చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సుబాబుల్, యూకలిప్టస్ సాగును వ్యవసాయ ఉత్పత్తులుగా పరిగణించాలని లంకా దినకర్ కోరారు. ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ ముందుకు ప్రాధాన్యతతో తీసుకెళ్లి రైతులకు తగిన పన్ను ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.



