Amaravathi Local News :శాఖల్లో సమర్థత పెంచి.. సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యం

Sharat
1 View

అమరావతి, ఆగస్టు 24:– ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి ప్రజలకు వేగంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్‌పై సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతిని సీఎం సమీక్షించారు.

ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్‌చెయిన్‌ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించి ఆన్‌లైన్‌ సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజలు ఏ పని కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

వాట్సాప్‌ గవర్నెన్స్‌ ‘మనమిత్ర’ ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ ప్రక్రియను మరింత సంక్షిప్తం చేయాలని సీఎం సూచించారు. సర్టిఫికెట్లను పదేపదే అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకుండా వివిధ శాఖల డేటాను అనుసంధానం చేయాలని ఆదేశించారు. శాఖల మధ్య డేటా ఇంటిగ్రేషన్‌ ద్వారా ప్రజలకు సమయం, శ్రమ ఆదా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పంటల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో పంటల పరిస్థితిపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ఈ ఏడాది వ్యవసాయ దిగుబడులు సాధారణం కంటే సుమారు 20 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించే అవకాశం ఉందని వెల్లడించారు.

ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంకా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్‌ అలర్ట్‌లు పంపడంతో పాటు, వాటిపై అధికారులు తీసుకుంటున్న చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

క్రాప్‌ అలర్ట్‌ల పర్యవేక్షణకు ఏపీటీఎస్‌ అనలిటిక్స్‌ను వినియోగించుకోవడంతో పాటు అవేర్‌తో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

డెంగీ, మలేరియా హాట్‌స్పాట్‌లపై నిఘా

డెంగీ, మలేరియా కేసుల నియంత్రణకు హాట్‌స్పాట్‌లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాధులు ప్రబలే ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 1,361 డెంగీ కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 401 కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు సీఎంకు వివరించారు.

రెన్యువబుల్‌ ఎనర్జీకి ప్రాధాన్యం

రాష్ట్రాన్ని కార్బన్‌ న్యూట్రల్‌ దిశగా తీసుకెళ్లేందుకు పునరుత్పాదక ఇంధన వనరులపై మరింత దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా సోలార్‌ రూఫ్‌టాప్‌లను పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review