
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో గత కొన్నేళ్లుగా ఉన్న స్తబ్దతను తొలగిస్తూ.. ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజాలను విశాఖకు రప్పించడంలో మంత్రి నారా లోకేశ్ సఫలీకృతమయ్యారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌తో పాటు పలు కీలక ఐటీ కంపెనీల రాక ఖరారు కావడంతో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
ఈ క్రమంలో, యువతకు ఉపాధి కల్పిస్తూ ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్’గా పేరుగాంచిన మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ సాగరతీరంలో ఒక అద్భుతమైన సైకత శిల్పం వెలిసింది. ఎంజీఎం బీచ్ రోడ్డు తీరంలో ఏర్పాటు చేసిన ఈ శిల్పం ఇప్పుడు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రముఖ శిల్ప కళాకారుడు బాలాజీ వరప్రసాద్ తన నైపుణ్యంతో ఈ సైకత శిల్పాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అందులో “జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ లోకేశ్ అన్న”, “థ్యాంక్యూ లోకేశ్ అన్న.. వైజాగ్” అని రాసిన అక్షరాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ శిల్పంలో మరో విశేషం ఏమిటంటే.. ‘వైజాగ్’లోని చివరి ‘జీ’ అక్షరాన్ని ‘గూగుల్’ లోని మొదటి అక్షరం ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. లోకేశ్ కృషితో విశాఖ మళ్ళీ ఐటీ రాజధానిగా మారుతోందని కొనియాడారు. గూగుల్ వంటి సంస్థలు రావడం వల్ల కేవలం ఉద్యోగాలే కాకుండా, అనుబంధ రంగాల్లో కూడా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సైకత శిల్పాన్ని తిలకిస్తూ లోకేశ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకుంటున్నారు.


