విజయవాడ, సెప్టెంబర్ 28:-విజయవాడ నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, స్థానిక వ్యాపారాలు, కళాకారులు, చిరు వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విజయవాడ ఉత్సవం–2.0 నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవానికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం సోమవారం అంబేద్కర్ కళా వేదికలో ఘనంగా జరిగింది.
గత ఏడాది ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని, ఈ ఏడాది మరింత వైభవంగా ఉత్సవం–2.0ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ చిన్ని తెలిపారు. విజయవాడ ఉత్సవం నిర్వహించాలనే ఆలోచనకు ప్రభుత్వం, మంత్రులు, ప్రజలు, వివిధ వర్గాల నుంచి అందుతున్న సహకారం అభినందనీయమన్నారు.
విజయవాడ ఉత్సవం కేవలం సాంస్కృతిక కార్యక్రమానికి పరిమితం కాకుండా నగర బ్రాండ్‌ను మరింతగా పెంచేలా, పర్యాటకం, వాణిజ్యం, స్థానిక ఉపాధి అవకాశాలకు వేదికగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దసరా సందర్భంగా విజయవాడకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ప్రజలు వారికి ఆతిథ్య భావంతో స్వాగతం పలకాలని కోరారు. ప్రతి ఇల్లు, ప్రతి వ్యాపార సంస్థ ప్రత్యేకంగా అలంకరించి నగరాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
విజయవాడ ఉత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఉత్సవాల వల్ల స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, కళాకారులకు ఆదాయ, ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు.
650 స్టాళ్లతో నేషనల్ సరస్ మేళా
విజయవాడ పున్నమి ఘాట్‌లో తొలిసారిగా నేషనల్ సరస్ మేళాను నిర్వహిస్తున్నట్లు కేశినేని చిన్ని తెలిపారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మొత్తం 650 స్టాళ్లు ఏర్పాటు చేస్తుండగా, అందులో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలకు 230 స్టాళ్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో ఇలాంటి మేళాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో విజయవాడ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్, ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్సవాలు ఆర్థిక వ్యవస్థకు ఇంజన్‌గా మారాలి
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న కృషిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున ఉత్సవాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. విజయవాడ ఉత్సవాలు కేవలం వినోద కార్యక్రమాలుగా కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎకనామిక్ ఇంజన్‌గా మారాలని ఆకాంక్షించారు.
ఉత్సవాల ద్వారా స్థానిక వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు, కళాకారులకు ఆదాయ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అంతరించిపోతున్న తోలుబొమ్మలాట, తప్పెటగుళ్లు వంటి జానపద కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పద్య, పౌరాణిక నాటకాలకు కూడా ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం కల్పించాలని సూచించారు. కళలు యువతలో సృజనాత్మకతతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని తెలిపారు.
విశాఖ, అరకు, నెల్లపట్టు తరహాలో విజయవాడ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విజయవాడ వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాం
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ విజయవాడకు చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ఉందన్నారు. విజయవాడ ఉత్సవాల ద్వారా నగర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతున్నామని తెలిపారు. విజయవాడ ఉత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ఎంపీ కేశినేని చిన్ని తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు.
దసరా సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. విజయవాడ ఉత్సవాలు పర్యాటక అభివృద్ధి, స్థానిక ఉపాధి, వ్యాపార అవకాశాల పెంపునకు వేదికగా నిలుస్తాయని తెలిపారు.
మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కుటుంబాలను బలోపేతం చేస్తుందని, మహిళా సంక్షేమ కార్యక్రమాలు కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవాల స్ఫూర్తితో ధర్మవరంలో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆకట్టుకున్న విజయవాడ ఉత్సవ్ ట్రైలర్
కార్యక్రమంలో విజయవాడ ఉత్సవ్ ట్రైలర్, ఉత్సవ్ పాటను మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కలిసి ఆవిష్కరించారు. విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలు, నగర వైభవం ఉట్టిపడేలా రూపొందించిన ట్రైలర్ ఆకట్టుకుంది. గత ఏడాది విజయవాడ ఉత్సవం జరిగిన తీరును, ప్రజలు ఉత్సవాన్ని తమ సొంత పండుగగా భావించిన అనుభూతులను ప్రతిబింబించేలా రూపొందించిన వీడియోకు మంచి స్పందన లభించింది.
విజయవాడ ఉత్సవ్–2.0 మరింత విజయవంతం అవుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, నిర్వాహకులు ఆకాంక్షించారు. ట్రైలర్‌తో పాటు విజయవాడ ఉత్సవ్ పోస్టర్‌ను, జిజ్ఞాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న కాంపిటీషన్‌కు సంబంధించిన పోస్టర్లను అతిథులు కలిసి ఆవిష్కరించారు.
ప్రజల ఉత్సవంగా విజయవాడ ఉత్సవం
విజయవాడ ఉత్సవం–2.0ను నగర ప్రజలందరి ఉత్సవంగా నిర్వహించేందుకు కార్యక్రమాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. నగర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మికతతో పాటు స్థానిక వాణిజ్యానికి ప్రోత్సాహం కల్పించేలా ఉత్సవ కార్యక్రమాలు ఉండనున్నాయని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సహకారం, నిర్వాహకుల సమన్వయం, మీడియా ప్రచారంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేసి నగర వైభవాన్ని దేశానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు పట్టాభి, ఎం.ఎస్. బేగ్, రఘురామరాజు, లంక దినకర్, తేజస్వి, పేరేపి ఈశ్వర్, గుమ్మడి జయరాజ్, రామ్ ప్రసాద్ తదితరులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.



