: ప్రోటోకాల్ పక్కనపెట్టిన ఉపరాష్ట్రపతి! సామాన్యుడి ఇంటికి వెళ్లి ఏం చేశారంటే? 😲

Bhuvana

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి సామాన్యులను ఆత్మీయంగా పలకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆయన.. ముందుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని, ఆ తర్వాత గార మండలంలోని చారిత్రాత్మక శ్రీకూర్మనాథ స్వామిని దర్శించుకున్నారు.

ఆలయ దర్శనం అనంతరం బేడా మండపంలో పండితుల వేదాశీర్వచనం తీసుకున్న ఉపరాష్ట్రపతి.. తిరిగి వెళ్లేందుకు తన వాహనం వైపు నడిచారు. అయితే, అక్కడే ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సమీపంలోని ఒక ఇంటి వద్ద సంప్రదాయ దుస్తుల్లో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు రాపోలు నరసింహంపై ఉపరాష్ట్రపతి దృష్టి పడింది. తన కోసం సిద్ధంగా ఉన్న వాహనాన్ని ఎక్కకుండానే.. నేరుగా ఆ ఉపాధ్యాయుని ఇంటికి వెళ్లారు రాధాకృష్ణన్.

ఉపరాష్ట్రపతి పలకరింపు): నరసింహంను ఆత్మీయంగా పలకరించి, ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు ఉపరాష్ట్రపతిని నిండు మనసుతో ఆశీర్వదించారు.

అంతటితో ఆగకుండా, కూర్మనాథ క్షేత్రం సింహద్వారం వద్ద వేచి ఉన్న సామాన్య భక్తుల వద్దకు కూడా ఆయన నడుచుకుంటూ వెళ్లారు. వారితో కరచాలనం చేస్తూ, చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. మరికొంతమంది పేదలకు స్వయంగా ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. అత్యున్నత పదవిలో ఉండి కూడా సాధారణ వ్యక్తిలా ప్రజల మధ్యకు వెళ్లిన ఉపరాష్ట్రపతి తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ ప్రసాద్‌తో, న్యూస్ డెస్క్.

Author
Share This Article
Leave a review