ప్రముఖ సాహితీవేత్త విలియం షేక్స్పియర్ జయంతి సందర్భంగా పుత్తూరులో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ… షేక్స్పియర్ కేవలం ఇంగ్లీష్ భాషకు పరిమితమైన రచయిత కాదని, ఆయన రచనల్లో సమాజం, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, మానవ మనస్తత్వం యొక్క విభిన్న కోణాలు ప్రతిబింబిస్తాయని, ఆయన రచనలు ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రతి పాత్రలో మనిషి స్వభావాన్ని అద్భుతంగా చిత్రీకరించిన గొప్ప నాటక కర్తగా షేక్స్పియర్ నిలిచారని తెలిపారు. ప్రపంచం ఒక వేదిక, అందులో మనుషులు నటులే” అనే ఆయన భావనలో ఉన్న లోతైన ఆధ్యాత్మికతను, విద్యార్థుల్లో సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నేటి యువతలో చాలా మంది ఇంజనీరింగ్, వైద్య రంగాలవైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారని, సాహిత్యాన్ని తక్కువగా చూడటం సమాజానికి నష్టకరమని పేర్కొన్నారు. సాహిత్యం చదవడం అనేది కేవలం ఒక కోర్సు కాదని, అది ఒక జీవన విధానం అని, దీనికి ప్యాషన్‌తో పాటు లోతైన ఆలోచన అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో ముందుకు సాగుతూ సమాజానికి సేవ చేయాలని, సాహిత్యం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఎమ్మెల్యే మాధవి ఆకాంక్షించారు.



