చీరాల, జూలై 24 (వార్త): చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో తొలి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు మాట్లాడుతూ 2001లో మూడు విభాగాలు, 180 సీట్లతో ప్రారంభమైన కళాశాల ప్రస్తుతం 9 అండర్ గ్రాడ్యుయేట్, 8 పీజీ, 5 డిప్లొమా కోర్సులతో 5,500కు పైగా సీట్ల సామర్థ్యంతో అభివృద్ధి చెందిందన్నారు. డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు ఒకే విద్యాసంస్థలో చదివే అవకాశాన్ని కళాశాల కల్పిస్తోందని తెలిపారు. పట్టభద్రులైన విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి దేశాభివృద్ధికి తమ వంతు సేవలందించాలని ఆకాంక్షించారు.
కళాశాల కమిటీ చైర్మన్ వనమా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కళాశాల ఎఐసీటీఈ, ఎన్‌బీఏ, నాక్ వంటి జాతీయ సంస్థల గుర్తింపు పొందిందని, 2022లో జేఎన్‌టీయూకే నుంచి అటానమస్ హోదా సాధించడం సంస్థ అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లోని ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె. మధుమూర్తి మాట్లాడుతూ సమాజ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ ఆవిష్కరణలను రూపొందించుకోవాలని సూచించారు. నిర్మాణాత్మక ఆలోచనలతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని, రానున్న రోజుల్లో అవి రాష్ట్ర, దేశ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రతి రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి విద్యార్థి దానిపై పట్టు సాధించి సమాజ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని, కళాశాల భవిష్యత్తులో విశ్వవిద్యాలయంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పట్టభద్రులతో కళాశాల ప్రిన్సిపాల్ గ్రాడ్యుయేషన్ ప్రతిజ్ఞ చేయించారు. గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, నగదు బహుమతులను ప్రొఫెసర్ కె. మధుమూర్తి అందజేశారు. అనంతరం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో కళాశాల కమిటీ వైస్ చైర్మన్ బి. ఫణిరాజు, డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా. సి. సుబ్బారావు, మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాథ్, డైరెక్టర్ (ఫైనాన్స్) బి. సాయి చరణ్ రాజు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



