GUNTUR CITY NEWS: వాల్ పోస్టర్స్ అంటిస్తే పోలీసు కేసు నమోదు – క్లీన్ గుంటూరుకి ప్రతి ఒక్కరి సహకారం అవసరం

Karthik

వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని, పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలు పని చేస్తాయని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా వాల్ పోస్టర్స్ అంటించే వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని, సదరు కేసు మేరకు భాధ్యులకు షుమారు 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. కనుక నగరంలో వాల్ పోస్టర్స్ అంటించడం నిషేధమని, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కూడా నిర్దేశిత అనుమతులు తీసుకొని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరంలోని ఫ్లెక్సి, వాల్ పోస్టర్స్ ప్రింటర్స్, వివిధ మతాలకు చెందిన పెద్దలు, సినిమా ధియేటర్ల యజమానులతో క్లీన్ గుంటూరులో భాగంగా పోస్టర్ ఫ్రీ సిటిపై సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రభుత్వ కార్యాలయాల గోడలు, డివైడర్లు, పార్క్ లు, చివరికి స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు కూడా విచ్చలవిడిగా వాల్ పోస్టర్స్ అంటిస్తున్నారని, ఇక నుండి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. వచ్చే వారం నుండి పోస్టర్స్ అంటిస్తే ఒక్కో పోస్టర్ కి మొదటిసారి రూ.5 వేలు, రెండో సారి రూ.10వేలు, 3వసారి రూ.50 వేలు అపరాధ రుసుం విధించి, పోలీసు కేసు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో మంచి స్లోగన్లు లేదా ప్రభుత్వ పధకాలతో ఏర్పాటు చేసిన పెయింటింగ్ లపై పోస్టర్స్ అంటించి నగర సుందరీకరణకు ఆటంకం కల్గిస్తున్నారన్నారు. సెంట్రల్ డివైడర్ లో మొక్కలను కూడా తొలగిస్తూ బోర్డ్ లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇష్టానుసారం పోస్టర్స్ అంటించే కోచింగ్ సెంటర్ల ఫై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డివైడర్లు, కార్యాలయాల గోడలు, బ్రిడ్జిల గోడలు మరియు బహిరంగ ప్రదేశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు కట్టే వారు, పోస్టర్లు అంటించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అటువంటి వారిపై భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆదివారం నుండి వారం రోజుల పాటు పట్టణ ప్రణాళిక అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యెక బృందాలు వాల్ పోస్టర్స్ అంటించిన వారిని గుర్తించి, పోలీసు కేసు నమోదు చేస్తారన్నారు. రాత్రి సమయంలో పోస్టర్స్ అంటించడం, బ్యానర్లు కట్టే వారిపై కూడా నిఘాకి సిబ్బందిని కేటాయించామన్నారు. అలాగే వాల్ పోస్టర్స్ ప్రింటింగ్ నిషేదమని, ఫ్లెక్సీలు కూడా ప్రింట్ చేయాలి అంటే తప్పనిసరిగా ప్రింటర్, ప్రింటింగ్ ప్రెస్ పేరు, వివరాలు ప్రతి బ్యానర్ పై ఉండాలని, లేకుండా ఇరువురిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజయవాడలోని కొన్ని ప్రింటింగ్ ప్రెస్ ల్లో పోస్టర్స్ ప్రింట్ చేసి, గుంటూరులో అంటిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డివైడర్లలో కూడా ఎటువంటి బోర్డ్ లు, బ్యానర్లు, లాలి పప్ బోర్డ్ లు ఉండడానికి వీలు లేదని, పట్టణ ప్రణాళిక కార్యదర్శులు తమ పరిధిలో ఉండే వాటికి వారే భాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, డిసిపీ సూరజ్ కుమార్, ఏసిపీలు రెహ్మాన్, జకియా, టిపిఓ, టిపిఎస్, టిపిబిఓలు, ఫ్లెక్సి, వాల్ పోస్టర్స్ ప్రింటర్స్, వివిధ మతాలకు చెందిన పెద్దలు, సినిమా ధియేటర్ల యజమానులు పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review