GUNTUR CITY NEWS: కలుషిత త్రాగునీటి సరఫరాకు అవకాశం ఇవ్వరాదు – అనుమానిత ప్రాంతాల్లో అమ్మోనియా పరీక్షలు తప్పనిసరి

Karthik

గుంటూరు నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో రాజీ ఉండబోదని, కలుషిత త్రాగునీటి సరఫరా జరగడానికి వీల్లేదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శనివారం శ్రీనగర్, శారదా కాలనీ, సంజీవయ్య నగర్, సుగాలీ కాలనీ, శివనాగరాజు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులు, త్రాగునీటి సరఫరా పరిశీలించి అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి వార్డ్ సచివాలయం పరిధిలో త్రాగునీటి పైప్‌లైన్‌లకు ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. పైప్‌లైన్‌లు డ్రైనేజీ లైన్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలను గుర్తించి, వెంటనే సాంకేతికంగా పరిశీలించాలని సూచించారు. సుగాలీ కాలనీలో డ్రైన్‌లో త్రాగునీటి పైప్‌లైన్ ఉండడాన్ని గుర్తించి, ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా నిర్లక్ష్యం జరిగినందుకు సంబంధిత ఎమినిటి కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎస్‌ఈని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో తప్పనిసరిగా అమ్మోనియా టెస్టులు నిర్వహించాలని, ప్రతి రోజు నిర్వహించే నీటి నాణ్యత పరీక్షల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. నిర్వహించిన ప్రతి ఎమినిటి టెస్ట్‌ను వెంటనే సిఎంఎం యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. శారదా కాలనీలోని రిజర్వాయర్‌ను పరిశీలించిన కమిషనర్, రిజర్వాయర్ పరిసరాల్లో ఉన్న అనవసర వస్తువులను తొలగించి పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. క్లోరిన్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి, వాటి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. త్రాగునీటి సరఫరా కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై పేరుకుపోకుండా వెంటనే తొలగించాలని ప్లానింగ్ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఖాళీ స్థలాలు, కాలనీల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.పర్యటనలో అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఎస్ఎస్ లు సాంబయ్య, ఐజాక్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review