అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు గ్రామ/వార్డు స్థాయిలోనూ, జూన్ 10 నుంచి 12వ తేదీ వరకు మండల స్థాయిలోనూ, జూన్ 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని వివరించారు. జూన్ 18 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు. వ్యక్తిగత విభాగం, బృంద విభాగం, జ్ఞాన ఆధారిత యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వ్యక్తిగత విభాగంలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం., జ్ఞాన ఆధారిత పోటీలలో యోగా క్విజ్, యోగా వ్యాసరచన, యోగా నినాదాల పోటీలు ఉంటాయన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని పార్కులు, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జూన్ 21న రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ వేడుకలు అమరావతిలో వెస్ట్రన్ బై పాస్ రహదారిపై జరుగుతాయన్నారు. ‘యోగాంధ్ర – 2026’ పేరుతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ (Yoga for Healthy Aging) నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగా చేస్తూ యోగాతో ఆరోగ్యం నినాదంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఏ రంగంలో ఉన్న వారైనా యోగా చేయడం ఉత్తమని, ప్రతి ఒక్కరికీ దైనందిన దినచర్య కావాలని సూచించారు. యోగా భౌతిక, మానసిక ఆరోగ్యానికి ప్రతీక అన్నారు. జిల్లాలో ఉండవల్లి గుహలు, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. యోగా భారతీయ సంస్కృతిలో భాగమని, యోగా ప్రయోజనాలు గుర్తించిన అనేక దేశాలు యోగాను ఆచరిస్తూ జీవన శైలిలో మార్పులు తీసుకువస్తూ ఆరోగ్య సమాజానికి కృషి చేస్తుందని తెలిపారు. యోగాను ప్రతీ ఒక్కరూ ఆచరించి, ఆరోగ్యదాయక సమాజంలో భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



