Ntr distric News :ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శకంగా అమలు చేయండి-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

Sharat
1 View

విజయవాడ, జూన్ 12 :-ఎన్టీఆర్ జిల్లాలో వడ్డెర కులస్థుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హత కలిగిన వడ్డెర సొసైటీల ద్వారా మెటల్, గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. అలాగే జిల్లాలో ఇసుక సరఫరా విధానాన్ని పూర్తిస్థాయిలో పారదర్శకంగా అమలు చేయడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో తొమ్మిది ఇసుక రీచ్‌ల ద్వారా ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సుమారు 4.48 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా సరఫరా చేయాలని సూచించారు.

జగ్గయ్యపేట సమీపంలోని కృష్ణానదిలో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించేందుకు అవసరమైన అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ సహకారంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వడ్డెర కులస్థుల ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.90 ప్రకారం వడ్డెర సొసైటీలకు 50 శాతం రాయితీతో మెటల్, గ్రావెల్ తవ్వకాల అనుమతులు కల్పిస్తోందన్నారు. జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది వడ్డెర సొసైటీలు ఉండగా, వాటిలో ఇబ్రహీంపట్నం మండలంలో ఆరు, విజయవాడ రూరల్ మండలంలో రెండు సొసైటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి సొసైటీలో కనీసం 25 మంది సభ్యులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 100 హెక్టార్లలో మెటల్, గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఎన్టీఆర్ జిల్లాకు 11 హెక్టార్లలో తవ్వకాలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. పరిటాల, జి.కొండూరు మండలాల పరిధిలోని లోయ ప్రాంతాల్లో క్రషర్ యూనిట్ల నిర్వహణకు కూడా అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన వడ్డెర సొసైటీలు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ కె. వీరస్వామి, డీపీవో లావణ్య కుమారి, డీటీసీ ఆర్టీఓ డి.వి. రమణ, కేసీ డివిజన్ ఈఈ రవికిరణ్, నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review