విజయవాడ, జూన్ 14 :– రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ‘తాలీమ్-ఏ-హునర్’ కార్యక్రమం ద్వారా 250 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉచిత రెసిడెన్షియల్ విద్య అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమ, న్యాయ, వక్ఫ్ మరియు ఉర్దూ అకాడమీ శాఖల మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూఖ్ తెలిపారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన కాలేజ్ అలాట్‌మెంట్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో వక్ఫ్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో 250 మంది విద్యార్థులకు ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యా అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు.
పేదరికం కారణంగా చదువులకు దూరమవుతున్న మైనారిటీ విద్యార్థులు, ముఖ్యంగా బాలికలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదో తరగతిలో 450కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేక ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, మొత్తం 7,400 దరఖాస్తులలో 6,605 మంది పరీక్షకు హాజరుకాగా, అందులో 250 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల చదువుల కోసం దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా బాలికల కోసం 33 శాతం రిజర్వేషన్ కేటాయించగా, ఎంపికైన వారిలో 41 శాతం మంది బాలికలు ఉండటం శుభపరిణామమన్నారు.
విద్యార్థులను విజయవాడలోని ప్రతిష్ఠాత్మక చైతన్య గోశాల క్యాంపస్‌లో చేర్పించి ఐఐటీ, మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (P4) విధానంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, ముస్లిం విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక కోర్సుల్లో రాణించాలని సూచించారు.
ఎమ్మెల్సీ జకియా ఖానమ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు షరీఫ్ మహ్మద్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మహ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్య ద్వారానే మైనారిటీ సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ, దేశ చరిత్రలో తొలిసారిగా వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని మైనారిటీ విద్యార్థుల విద్య కోసం వినియోగించడం విశేషమన్నారు. భవిష్యత్తులో లబ్ధిదారుల సంఖ్యను 2,500 మందికి పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
విజయవాడ డీసీపీ షరీనా బేగం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ, ఏపీ నూర్ భాషా/దూదేకుల సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగుల్ మీరా, షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముఖ్తియార్, వక్ఫ్ బోర్డు సీఈవో యాకుబ్ బాషా, మాజీ ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్, ముత్తావలీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



