విశాఖపట్నం, జూన్ :-విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. అభిషిక్త్ కిషోర్ (ఐఏఎస్) శనివారం రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను సందర్శించి అక్కడి నిర్వహణ, సాహస క్రీడల (అడ్వెంచర్ స్పోర్ట్స్) కార్యకలాపాలు, అలాగే ఏపీ టూరిజం అభివృద్ధి సంస్థ (APTDC) సమాచార, రిజర్వేషన్ కౌంటర్ పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పచ్చదనంతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. బీచ్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సరైన పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు, పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టి సందర్శకులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని తెలిపారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యకలాపాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, పర్యాటకులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీటीडీసీ డివిజనల్ మేనేజర్ జీవీబీ జగదీష్, జీవీఎంసీ మధురవాడ జోన్ జోనల్ కమిషనర్ వి. అయ్యప్పనాయుడు, పీజీ సర్వీసెస్ ప్రతినిధి శ్రీమతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



