విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జూలై 29 బుధవారం గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం 5:55 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభం కానుందని వెల్లడించారు.
కొండదిగువ ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమై ఇంద్రకీలాద్రి చుట్టూ కొనసాగనుంది. ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థానం వెల్లడించింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ పవిత్ర గిరిప్రదక్షిణలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని భక్తులను దేవస్థానం అధికారులు కోరారు.



