బాపట్ల, జూలై 30 :– పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అనే పంచభూతాల పరిరక్షణే నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
బాపట్ల పట్టణంలోని 24వ వార్డు భావపురి కాలనీలో ఉన్న శ్రీ భావపురి విద్యాసంస్థల ట్యూషన్ సెంటర్లో గురువారం నిర్వహించిన జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సమావేశానికి ఆవల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారుల అనుమతితో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల జిల్లా సమగ్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. రాధామాధవి మాట్లాడుతూ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అందించే మొక్కలను జిల్లాలోని 63 సెక్టార్ల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల ద్వారా నాటించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్. శివపార్వతి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సహకారంతో అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఆయా వార్డుల్లోని మహిళలకు కూడా మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా అంగన్వాడీ కార్యకర్తలు చేపడతారని చెప్పారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్‌తో సమన్వయం చేసుకుని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అనంతరం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. రాధామాధవిని సత్కరించి జ్ఞాపికతో పాటు మొక్కలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ సూపర్వైజర్ జి. జ్యోతి, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ డైరెక్టర్లు గురజాల శ్రీనివాసరావు, పి. ప్రసాదరావు, కుర్ర భగవాన్, తడికమళ్ల నాగప్రసాద్, నరసింహారావు, వీరాస్వామి, అంగన్వాడీ టీచర్ బుజ్జమ్, పలువురు అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.



