visakha Local News :భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షప్రధాని మోదీ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

Sharat
2 Views

భోగాపురం, జూలై 30: కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర రోడ్లు–భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ తాగునీరు, ఆహారం తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు, నిర్వాహక కమిటీలకు సూచించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవనున్నదని, ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review