అమరావతి, జూలై 31:– ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు (ప్రీమియం చెల్లింపు) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. జూలై 31తో ముగియాల్సిన నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు బీమా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వరి మినహా మిగిలిన అన్ని ఖరీఫ్ పంటలకు కూడా వరి పంటకు వర్తించే గడువునే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలు సానుకూలంగా స్పందించాయని చెప్పారు.
పంటల బీమా ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, ఇతర అనుకోని పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టాలకు రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన రక్షణ వ్యవస్థ అని మంత్రి పేర్కొన్నారు. రుణగ్రహీత, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటల బీమాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
సాగు చేసిన ప్రతి ఎకరానికి పంటల బీమా నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. రైతులు సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో ఆగస్టు 15లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, పోర్టల్‌పై చివరి రోజుల్లో ఏర్పడే రద్దీని నివారించేందుకు వీలైనంత త్వరగా పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.



