అమరావతి, ఆగస్టు 3 (ప్రతినిధి): గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారికి అండగా నిలవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులను ఆదుకోలేని జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 12.93 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుందని, దీంతో రైతులను పూర్తిగా మార్కెట్ దయాదాక్షిణ్యాలకే వదిలేశారని మంత్రి ఆరోపించారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపడంలోనూ, మార్కెట్లో సమర్థవంతంగా జోక్యం చేసుకోవడంలోనూ అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. గత ఏడాది సుమారు 25 మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకును రూ.270 కోట్ల విలువతో కొనుగోలు చేసి వేలాది మంది రైతులకు అండగా నిలిచినట్లు చెప్పారు. అలాగే ఎఫ్‌సీవీ (వర్జీనియా) పొగాకు రైతుల కోసం లో, ఆఫ్ స్టైల్ రకాల పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోందన్నారు. ఇందుకోసం సుమారు రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 100 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని, ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు అందించే ప్రక్రియ కూడా అమలులో ఉందని వివరించారు.
రైతులకు మార్కెట్ భరోసాతో పాటు ఆర్థికంగా చేయూత అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించేలా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా కృషి చేసిందన్నారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం సాధ్యమైందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం తదితర కారణాలతో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు రైతులకు పంటల బీమా కీలక రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఆగస్టు 15లోపు పంటల బీమాలో నమోదు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతులు తక్కువ ప్రీమియంతో బీమా పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, వ్యవసాయ అధికారులు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి ప్రతి అర్హ రైతు బీమా నమోదు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
రైతుల కష్టసుఖాలు పట్టించుకోని వారు ఇప్పుడు రైతు ప్రేమ గురించి మాట్లాడటం విడ్డూరమని, మాటల్లో కాదు చేతల్లో రైతులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ నిబద్ధత అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.



