అమరావతి, ఆగస్టు 3 :– రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ‘నేతన్న సేవలో’ పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. చేనేతల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
మంత్రి వివరాల ప్రకారం, ‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హులైన ప్రతి చేనేతకు సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో, అర్హులైన చేనేతలు తప్పనిసరిగా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల హామీల్లో లేకపోయినా చేనేతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే మగ్గంపై పనిచేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గం కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. త్రిఫ్ట్ ఫండ్ నిధులు, ముద్ర రుణాల ద్వారా కూడా చేనేతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
‘నేతన్న సేవలో’ పథకం అమలులో ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావులేకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన ప్రతి చేనేత నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ నెల 6వ తేదీ ఉదయానికి అన్ని జిల్లాల నుంచి లబ్ధిదారుల పూర్తి వివరాలను అందజేయాలని శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 7న చీరాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదే రోజు ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో అధికారులు, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.



