గుడివాడ:– డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువతతో కలిసి ఉద్యమించాలని గుడివాడ ఏరియా రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం (RMP) పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘నశా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్’ సంకల్ప అభియాన్ – 100 ఆదివారాలు డ్రగ్స్‌పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా గుడివాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూచౌక్, మార్కెట్ సెంటర్, బస్టాండ్ మీదుగా కొనసాగింది. డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. “గంజాయి వద్దు.. కుటుంబమే ముద్దు”, “డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసికట్టుగా పోరాడుదాం” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్వాహకులు తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ సలహాదారు లంక దాసరి ప్రసాదరావు, రాష్ట్ర ఆర్ఎంపీ అధ్యక్షుడు నండూరి ఉమాశంకరరావు, జిల్లా ఆర్ఎంపీ అధ్యక్షుడు సాగిరాజు ఉదయ భాస్కర్ రాజు, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, మాచర్ల రామకృష్ణ (ఆర్‌కే), ఆర్ఎంపీ వైద్యులు, నిర్వాహకులు, యువ వైద్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.



