సత్తెనపల్లి:- సత్తెనపల్లి పట్టణంలోని 17వ వార్డులో ‘మన సత్తెనపల్లి.. మన సుధీర్ అన్న’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొని గడపగడపకు వెళ్లి కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు.
వార్డు పర్యటన అనంతరం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన సుధీర్ భార్గవ రెడ్డి, ప్రతి కార్యకర్తకు అండగా నిలవాలని, ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని, బీఎల్ఏలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను పరిశీలిస్తూ చిన్నచిన్న మార్పులు, చేర్పులు, సవరణలను గుర్తించి సరిచేయించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నాయకులు ఎప్పటికప్పుడు బూత్ స్థాయి పరిస్థితులను పరిశీలిస్తూ పార్టీకి అనుకూలంగా పనిచేయాలని తెలిపారు.
అనంతరం 17వ వార్డులోని రాజశేఖర్ రెడ్డి, తమ్మినేని వెంకటేశ్వర రెడ్డి, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



