PALNADU NEWS :ప్రమాద రహిత పల్నాడు లక్ష్యంగా రహదారి భద్రత చర్యలు-నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

Sharat
1 View

నరసరావుపేట, ఆగస్టు 18:– పల్నాడు జిల్లాను రహదారి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి, క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు.

పల్నాడు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాలను గుర్తించి, భవిష్యత్‌లో అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరగకుండా అవసరమైన హెచ్చరిక బోర్డులు, రహదారి భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రజా ప్రదేశాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైన కరపత్రాలను రూపొందించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

లైసెన్సులు లేని వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు, అర్హులైన వారికి డ్రైవింగ్ లైసెన్సులు పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు.

జిల్లాలో ఇప్పటివరకు 34 బ్లాక్ స్పాట్లను గుర్తించగా, వాటిలో 16 జాతీయ రహదారులపై ఉన్నట్లు అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

రోడ్లపై ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించే వాహనాలు, అధిక బరువుతో నడిచే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించాలని సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా రహదారి భద్రతకు విఘాతం కలిగించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

రవాణా శాఖ జిల్లా అధికారి, కమిటీ మెంబర్ సెక్రటరీ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని రోడ్డు ప్రమాదాల గణాంకాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీస్ శాఖ తరఫున అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో అన్ని శాఖల అధికారులు తమవంతు సహకారం అందించాలని సమావేశంలో సూచించారు.

రోడ్ సేఫ్టీ ఎన్జీవో సంస్థ తరఫున ఆర్. కనకదుర్గ పద్మజ పలు సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్లను సరిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతారాణికి సూచించారు.

సమావేశంలో ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఎంహెచ్‌ఓ, జిల్లాలోని ఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review