Amaravathi news :సముద్రంలో గల్లంతైన కోనసీమ మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపుచర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Sharat
1 View

అమరావతి, ఆగస్టు 19:– బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు. ఇప్పటివరకు చేపట్టిన గాలింపు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ పోలీసులు మత్స్యకారుల కోసం సముద్రంలో గాలింపు చేపడుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. జిల్లా యంత్రాంగం గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు డోర్నియర్‌ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లను రంగంలోకి దించి గాలింపు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్‌ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన బోటు ఆచూకీకి సంబంధించి ఆయా ప్రాంతాల మత్స్యకారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వివరించారు.

పారాదీప్‌కు సుమారు 14 నాటికల్‌ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వాటి వివరాలను పరిశీలిస్తూ గల్లంతైన మత్స్యకారుల బోటుతో సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నామని చెప్పారు.

గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Author
Share This Article
Leave a review