Nellore city news :దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోబెట్టాలి-నెల్లూరు ప్రజా రవాణా అధికారిని కోరిన నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి

Sharat
1 View

నెల్లూరు, ఆగస్టు 20:– ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో సాధారణ ప్రయాణికులు కూర్చోకుండా చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. ఈ మేరకు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్‌ను కలిసి సమస్యను వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతోపాటు ప్రత్యేక సీట్లను కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు సక్రమంగా జరగడం లేదని కాలేషా తెలిపారు. బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో సాధారణ ప్రయాణికులు కూర్చుంటున్నా, వారిని ఖాళీ చేయించి దివ్యాంగులకు సీట్లు కల్పించడంలో కొందరు డ్రైవర్లు, కండక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నడవలేని, చూపు లేదా వినికిడి సమస్యలతో ఇతరుల సహాయంతో ప్రయాణించే దివ్యాంగులకు కేటాయించిన సీట్లు కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు డిపో మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ప్రజా రవాణా అధికారిని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కొన్ని బస్సుల్లో దివ్యాంగులు తమకు కేటాయించిన సీట్లను కోరినప్పుడు సాధారణ ప్రయాణికులు వారితో దురుసుగా, దుర్భాషలాడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కాలేషా పేర్కొన్నారు. సమస్యను కండక్టర్ల దృష్టికి తీసుకెళ్తే ‘ఎలాగోలా సర్దుకుపోండి’ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం సరికాదన్నారు.

దివ్యాంగుల హక్కుల చట్టం–2016 నిబంధనల ప్రకారం దివ్యాంగులకు కేటాయించిన సీట్లను వారికే అందేలా నెల్లూరు జిల్లాలోని అన్ని డిపో మేనేజర్లకు తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆదేశాలు అమలవుతున్న తీరును అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. ఉమామహేశ్వర లాల్, షేక్ వాజీదా తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review