మాడుగుల, ఆగస్టు 22: పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చి గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంటి స్థాయి నుంచి కాలనీ, గ్రామ స్థాయి వరకు పర్యావరణహిత విధానాలను అమలు చేస్తూ గ్రామాలను క్రమంగా నెట్‌జీరో కమ్యూనిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నెట్‌జీరో కార్యక్రమాల అమలును పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాలు, సాధిస్తున్న లక్ష్యాలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సీఎంకు వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ, మురుగునీటి నిర్వహణ వంటి చర్యలతో కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నట్లు తెలిపారు.
ఇంటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు
నెట్‌జీరో కార్యక్రమాలను అమలు చేస్తున్న జె. మహేశ్వరరావు నివాసాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఇంట్లో తడి వ్యర్థాలను ప్రత్యేక కంపోస్టింగ్ గుంతల్లో వేసి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. వ్యర్థాలను ఎరువుగా మార్చడం ద్వారా ఎరువుల కొనుగోలు ఖర్చుతో పాటు వ్యర్థాల సేకరణ, రవాణా, నిర్వహణపై పడే భారం తగ్గుతుందని మహేశ్వరరావు వివరించారు. వ్యర్థాలను సమస్యగా కాకుండా వనరుగా మార్చే విధానాన్ని మరిన్ని గ్రామాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
మురుగునీటికి ఇంటి వద్దే పరిష్కారం
ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని రోడ్లపైకి వదలకుండా నిర్దేశిత గుంతల్లోకి మళ్లించే ఇన్‌సిటు వేస్ట్‌వాటర్ మేనేజ్‌మెంట్ విధానాన్ని సీఎం పరిశీలించారు. ఈ విధానం వల్ల రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండకుండా చూడటంతో పాటు దోమలు, ఈగల వృద్ధిని నియంత్రించవచ్చని లబ్ధిదారు వివరించారు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పును తగ్గించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించవచ్చన్నారు.
సోలార్ విద్యుత్‌తో ఇండక్షన్ వంట
ఇంధన వినియోగాన్ని తగ్గించేలా ఇంట్లో ఏర్పాటు చేసిన ఇండక్షన్ స్టవ్ పనితీరును కూడా సీఎం పరిశీలించారు. దీపం పథకం కింద ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నప్పటికీ.. ఇండక్షన్ స్టవ్ వినియోగంతో గ్యాస్‌పై ఆధారపడటాన్ని మరింత తగ్గించవచ్చని లబ్ధిదారులు తెలిపారు. అనంతరం ఇంటిపై ఏర్పాటు చేసిన 3 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్‌ను సీఎం పరిశీలించారు. సౌర విద్యుత్‌తో ఇండక్షన్ స్టవ్‌ను వినియోగించడం ద్వారా విద్యుత్, గ్యాస్ ఖర్చులను తగ్గించుకోవచ్చని వివరించారు.
అనంతరం లబ్ధిదారు కుటుంబంతో సీఎం చంద్రబాబు సెల్ఫీ దిగారు. ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టి ప్రతి గ్రామాన్ని నెట్‌జీరో దిశగా తీసుకెళ్లే కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.



