Bapatla Local news :బాపట్ల పర్యాటక విశేషాలను ప్రపంచానికి చాటేలా ‘బే ఆఫ్ బాపట్ల

Sharat
2 Views

బాపట్ల:– బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామాన వెంకట శివన్నారాయణ అన్నారు. బాపట్ల జిల్లా పర్యాటక విశేషాలను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘బే ఆఫ్ బాపట్ల’ అంతర్జాల స్థలం బాపట్లకు గర్వకారణమని పేర్కొన్నారు.

పట్టణంలోని శృంగారపురంలో శనివారం ‘బే ఆఫ్ బాపట్ల’ అంతర్జాల స్థల రూపకర్త విన్నకోట చాందిని శ్రీని జనసేన పార్టీ నాయకులు శివన్నారాయణ, మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో-కన్వీనర్ తేజా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దుశ్శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో రాష్ట్ర పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరం సహా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బాపట్ల పర్యాటక ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా ‘బే ఆఫ్ బాపట్ల’ అంతర్జాల స్థలాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. చాందిని శ్రీ భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేపట్టి బాపట్లకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ తేజా, మనాలి చైతన్య, పిట్టలవానిపాలెం మండల అధ్యక్షుడు దాదా, జిడుగు మాధురి, జ్యూస్ శ్రీను, శివయ్య, సత్యనారాయణ, వెంకటరావు, సాయిబాబు, సాయిరాం ప్రసాద్ తదితర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review