ఏలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఏలూరు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన వెయ్యి మట్టి వినాయక విగ్రహాలను శుక్రవారం ఏలూరు జిల్లాలోని వివిధ ఇంటర్మీడియట్ కళాశాలలకు, అలాగే రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేశారు. పర్యావరణహిత గణేష్ చతుర్థి వేడుకలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కళాశాల విద్యార్థులు వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థులు ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాల్లో విత్తనాలను అమర్చి సీడెడ్ వినాయకులను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాలను మట్టిలో కలిపినప్పుడు అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరిగేలా వీటిని తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేలా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ గోబినాథ్ రవీంద్రన్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మురళీధర్ రావు, వివిధ విభాగాల డీన్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.Eluru Town Planning Corruption అక్రమాలపై అనిశా పంజా!
ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ గోబినాథ్ రవీంద్రన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. సీడెడ్ వినాయకుల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మురళీధర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం, పర్యావరణం పట్ల బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. పర్యావరణహిత పండుగల నిర్వహణలో యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.



