విజయవాడ, సెప్టెంబర్ 15: భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పి. పుల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, సాంకేతిక అభివృద్ధి, విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణలో ఇంజనీర్ల పాత్ర కీలకమని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.Vijayawada City news
విద్యుత్ రంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇంజనీర్లు నూతన ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. విద్యుత్ భద్రత, సరఫరా నాణ్యత, అంతరాయాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య క్రమశిక్షణ, నిజాయితీ, సాంకేతిక నైపుణ్యం, దేశ సేవా స్ఫూర్తి ప్రతి ఇంజనీర్‌కు ఆదర్శమని పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. “ఇంజనీర్ల ఆలోచనలు – దేశ ప్రగతికి పునాదులు” అనే స్ఫూర్తితో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యుత్ రంగంలో మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
కాగా, ఇంజనీర్‌గా వివిధ విశిష్ట పదవుల్లో సేవలందించి ప్రస్తుతం ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి. పుల్లారెడ్డిని ఇంజనీరింగ్ అధికారులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో డైరెక్టర్ టెక్నికల్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ హెచ్‌ఆర్‌డీ టీవీఎస్ఎన్ మూర్తి, ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.



