Bapatla City news :సూర్యలంక బీచ్ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి— జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

Sharat
2 Views

బాపట్ల:-భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన సూర్యలంక బీచ్ పరిశుభ్రతకు గ్రీన్ అంబాసిడర్లు లక్ష్యంగా పెట్టుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా, శనివారం సూర్యలంక బీచ్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్ పరిశుభ్రతపై పలు కీలక సూచనలు చేశారు:

  • సమగ్ర పారిశుధ్యం: ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి ఫారెస్ట్ ప్రాంతం వరకు విధిగా పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.
  • నిత్యం పర్యవేక్షణ: రామాపురం, సూర్యలంక బీచ్‌లను నిత్యం చెత్త, వ్యర్థాలు లేకుండా రామాపురం తీరం తలను దువ్వుకునేంత అద్దంలా మెరిసిపోవాలని వ్యాఖ్యానించారు. శానిటరీ వర్కర్లు ప్రతిరోజు తీరాన్ని పరిశుభ్రం చేయాలని సూచించారు.
  • చెత్తకుండీల ఏర్పాటు: బీచ్ సమీపంలో ప్రతి వంద మీటర్లకు చెత్తకుండీలను ఏర్పాటు చేసి, వ్యర్థాలను అందులోనే వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ, సూర్యలంక బీచ్ స్థానిక గ్రామీణులకు, ప్రజలకు “బంగారు గుడ్డు పెట్టే బాతు” లాంటిదని వర్ణించారు. బీచ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకులకు అవసరమైన వసతి, వాష్‌రూమ్స్, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు మరియు వినోద కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చి, వారికి మర్యాదపూర్వక స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.Bapatla City News

ఈ కార్యక్రమం సందర్భంగా బాపట్ల ఎంపీడీవో బి. బాబురావు అందరిచేత ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు బీచ్‌లో నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ. హరికుమార్, డీపీఓ యల్. ప్రభాకర్ రావు, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, సీపీఓ ఏ.ఎస్. రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఆనంతరాజు, డీఎస్పీ చంద్రమౌళి, డీఈఓ శ్రీనివాస్ సింగ్, పోగ్రామ్ ఆఫీసర్ (ఎస్ఎస్ఏ) శ్రీనివాస్, డిఆర్డిఏ పీడీ బి. సింగయ్య, డ్వామా పీడీ ఏ.వి. విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిణి ఏ. లక్ష్మి, ఉద్యాన శాఖ APMIP పీడీ నీలిమ, జిల్లా పర్యాటక అధికారి బెన్హర్, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి రాజేష్, తహశీల్దార్ షేక్ సలీమాతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review