అరండల్‌పేట 11/2 లైన్‌లోని రజక భవన్‌లో ఆదివారం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దుప్పట్లు, బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ఒకప్పుడు విద్య, ఉద్యోగాల్లో ఆడపిల్లలకు అవకాశాలు పరిమితంగా ఉండేవని, కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయి అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో అధిక సంఖ్యలో బాలికలు కనిపించడం ఆనందంగా ఉందని, ఇది సమాజంలో వచ్చిన సానుకూల మార్పుకు నిదర్శనమని పేర్కొన్నారు.చదువు కోసం కుటుంబాలను, స్వగ్రామాలను విడిచి వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసించడం సాధారణ విషయం కాదని అన్నారు. అయితే వసతి గృహ జీవితం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుందని, తద్వారా భిన్న ఆలోచనలు, సంస్కృతులు, జీవన విధానాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. జీవితంలో విస్తృత దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ప్రతి విద్యార్థి తన జీవితానికి ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ఆ లక్ష్యం సాధించే వరకు పట్టుదలతో శ్రమించాలని సూచించారు. కేవలం చదువుతో సరిపెట్టుకోకుండా సమాజంలో నాయకత్వ పాత్రలు కూడా పోషించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆడపిల్లలు రాజకీయ రంగంలోకి కూడా రావాలని, సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.చదువే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనమని, తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా విద్యేనని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో, లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించి విజయాన్ని అందుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు, వసతి గృహ నిర్వాహకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



