NTR District News :నందిగామ అభివృద్ధికి రూ.19 కోట్ల పనులకు రేపు శ్రీకారం-పెండింగ్ సీసీ రోడ్లన్నీ పూర్తి చేయడమే లక్ష్యం.. ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం

Sharat
1 View

నందిగామ, సెప్టెంబర్ 21: -నందిగామ మున్సిపాలిటీ పరిధిలో రూ.19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో నందిగామకు మంజూరైన పనులు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం నందిగామలోని తన కార్యాలయంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

జీవో ఆర్టీ నంబర్ 1067 ద్వారా నందిగామ మున్సిపాలిటీకి రూ.19 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఒకే టెండర్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్ సీసీ రోడ్లను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

రూ.11 కోట్లకు పైగా వ్యయంతో 15 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధాన రహదారులతో పాటు మూడు మీటర్ల వెడల్పు ఉన్న ఇరుకు సందుల్లోనూ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సుమారు రూ.3 కోట్లతో ఆధునిక మున్సిపల్ భవనాన్ని నిర్మించనున్నారు.NTR distric news :ఆరోగ్యవంతమైన మీడియా సమాజానికి యోగా దివ్య ఔషధం: కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

రైతుపేటలోని గోవర్ధన్ గార్డెన్స్‌లో అర ఎకరం విస్తీర్ణంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో పబ్లిక్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. గాంధీ సెంటర్ నుంచి రామన్నపేట మార్గంలో సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు కూడా చేపట్టనున్నారు.

ఇదే సమయంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.40 కోట్లతో 32 పనులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో నందిగామ పట్టణంలో మొత్తం రూ.22 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు.

ఎన్నికల సమయంలో పట్టణంలోని ప్రతి రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తామని ఇచ్చిన హామీ మేరకు రెండేళ్లలోనే అవసరమైన నిధులు సాధించామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. గతంలో శిలాఫలకాలకు పరిమితమైన పనులకు భిన్నంగా ప్రస్తుతం జీవోలు, నిధుల మంజూరు, టెండర్ల ప్రక్రియతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు నందిగామ బాబు జగజ్జీవన్ రామ్ భవన్‌లో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మెప్మా సంఘాల మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ముఖ్యంగా సీసీ రోడ్లు నిర్మించనున్న ప్రాంతాల ప్రజలు కార్యక్రమానికి హాజరై అభివృద్ధి పనుల ప్రారంభానికి సాక్షులుగా నిలవాలని కోరారు. నందిగామ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Author
Share This Article
Leave a review