వినుకొండ:– వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.240 కోట్ల వ్యయంతో మంజూరైన సమగ్ర తాగునీటి పథకంలో భాగంగా తిమ్మాయపాలెం రోడ్డులో కొనసాగుతున్న పైప్లైన్ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమగ్ర తాగునీటి పథకం పూర్తయితే పట్టణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని నిరంతరం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు.
పైప్లైన్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
కార్యక్రమంలో జనసేన నాయకుడు నాగ శ్రీను రాయల్, సంబంధిత అధికారులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



