విజయవాడ: రైతు సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సీజన్‌లో సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు.
విజయవాడలోని అంత్రాలక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట్రస్థాయి సన్నద్ధత సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము
ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా, 92 శాతానికి పైగా సొమ్మును 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఈసారి కూడా సేకరణ సొమ్ము ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
సొంత వాహనాలకు రవాణా ఛార్జీలు
రైతులు తమ సొంత వాహనాల్లో కల్లాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలించినప్పుడు రవాణా ఛార్జీల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని ఈ ఖరీఫ్ నుంచి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. సొంత వాహనాలతో ధాన్యం తరలించే రైతులకు రవాణా ఛార్జీలను వీలైనంత త్వరగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం రవాణా కోసం జీపీఎస్ అమర్చిన సుమారు 31 వేల వాహనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
6.10 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధం
ధాన్యం సేకరణకు అవసరమైన 6.10 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎక్కడా గన్నీ బ్యాగుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయ బ్యాగులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
2,619 కొనుగోలు కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 2,619 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణకు దాదాపు 24 వేల మంది సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు.Vijayawada City news
ఉత్పత్తి అంచనాలపై సమీక్ష
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తొలుత అంచనా వేసిన నేపథ్యంలో ధాన్యం ఉత్పత్తి అంచనాలు తగ్గినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, పంట పరిస్థితుల కారణంగా దిగుబడి పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. గతంలో 1.60 కోట్ల టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తి అంచనా సుమారు 1.10 కోట్ల టన్నులకు తగ్గిందన్నారు. ప్రస్తుతం పరిస్థితులను మరోసారి సమీక్షించి అవసరమైతే ధాన్యం సేకరణ అంచనాలను సవరించనున్నట్లు చెప్పారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సేకరణ లక్ష్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రైతుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు
ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం, సమన్వయం పాటించాలని అధికారులను ఆదేశించారు.
మిల్లర్లు సహకరించాలి
ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వర్క్‌షాప్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కె. కన్నబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ ఖరీఫ్ పంట వివరాలను వెల్లడించారు.
కార్యక్రమంలో ఏపీఎస్‌సీఎస్‌సీ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్ (తోట సుధీర్), ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. పి.వి. సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ నుపూర్ అజయ్ కుమార్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారులు, రైతులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.



