Vijayawada City news :పరిటాల క్వారీలు, క్రషర్లతో తీవ్ర కాలుష్యం-రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి- సీపీఐ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్

S Sarath
4 Views

విజయవాడ:– ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామ పరిధిలోని క్వారీలు, క్రషర్ల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్ ఆరోపించారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పరిటాల పరిధిలో క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శంకర్ తెలిపారు. పంట పొలాల్లో దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో పంటలు సరిగా పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రైతులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్, రెవెన్యూ అధికారులు నిర్వహించిన సమావేశంలో తమ సమస్యలను ప్రశ్నించిన రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారుణమని శంకర్ ఖండించారు. బాధిత రైతుల పక్షాన నిలబడి సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, క్వారీలు, క్రషర్ల యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.Vijayawada City News

అనుమతుల గడువు ముగిసినప్పటికీ కొన్ని క్రషర్లు, క్వారీలు కొనసాగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. క్వారీల్లో పరిమితికి మించి బ్లాస్టింగులు నిర్వహించడం వల్ల సమీపంలోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు.

క్వారీ యజమానుల నిర్లక్ష్యం కారణంగా గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగినా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలు, నివాస ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకుని క్వారీలు, క్రషర్ల కార్యకలాపాలపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, బాధిత రైతులకు న్యాయం చేయాలని శంకర్ డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్వారీలు, క్రషర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగడంతో పాటు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లంకా గోవిందరాజులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review