GUNTUR DISTRICT NEWS: గ్రామ నీటి భద్రతా ప్రణాళికలు రూపొందించుకోవాలి

Karthik
6 Views

గ్రామ నీటి భద్రతా ప్రణాళికలు రూపొందించుకోవాలని మాస్టర్ ట్రైనర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.బ్రహ్మయ్య అన్నారు. జలధార –జలహారతి” కార్యక్రమములో భాగంగా వట్టిచెరుకూరు మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు, ఉపాధి హామీ సిబ్బందికి శుక్రవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అన్ని చిన్న నీటిమడుగుల పునరుద్ధరణ,  ఫీడర్ కాలువల మరమ్మత్తులు, నీటి వనరుల అనుసంధానం, వరద నీటి వినియోగం మట్టి మరియు నీటి సంరక్షణ పనులు,  రిడ్జ్ టు వ్యాలీ పద్ధతి అమలు, పచ్చదనం పెంపు, కొత్త నీటి నిల్వ నిర్మాణాలు, టెక్నాలజీ వినియోగం, చెరువుల ఫీడర్ ఛానల్స్ శుభ్రపరచడం, గట్లను బలోపేతం చేయడం, చెరువులను సమీపంలోని కాలువలు లేదా వాగులతో అనుసంధానించడం, మొక్కల పెంపకం, కొత్త నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటు, గ్రామ నీటి బడ్జెట్  తయారీ తదితర అంశాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. వీటి పర్యవేక్షణకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. భూగర్భ జలాల 3 నుండి 6 మీటర్ల మధ్య నీటి మట్టం పెరుగుదల లక్ష్యంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. 15 మీటర్ల కంటే లోతైన ప్రాంతాలు ప్రాధాన్యతగా గుర్తించాలని, కనీసం 1 మీటర్ మెరుగుదల సాధించాలని తెలిపారు. శాటిలైట్ చిత్రాల ద్వారా శాస్త్రీయంగా చెరువుల మ్యాపింగ్ చేయడం,  హైడ్రోలాజికల్ విశ్లేషణ ద్వారా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ఉపాధి హామీ పథకం నిధులతో పనుల అమలు,  నిరంతర పర్యవేక్షణ, భూగర్భ జల మట్టాల విశ్లేషణ వంటి దశలను పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం చేపట్టిన 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టి గ్రామ నీటి భద్రతా ప్రణాళికలు, సాగు నీటి సంఘాల పాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎం.పి.డి.ఓశివపార్వతి, మాస్టర్ ట్రైనర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ వి ఎస్. ప్రసాద్, జలవనరుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డి. జాన్ బాబు, ఎస్. సుబ్బరామి రెడ్డి,   గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, ఉపాధి హామీ ఏ.పి.ఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review