Guntur City News :మానవత్వం మెరిసింది: 69 ఏళ్ల బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవదానం – ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో ప్రశంసనీయ నిర్ణయం

S Sarath
1 View

గుంటూరు (ప్రత్యేక ప్రతినిధి):-పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురికి పునర్జన్మనిచ్చేలా నిలిచింది. మెదడులో రక్తస్రావం కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన 69 ఏళ్ల శ్రీ ఏ. హనుమంతరావు గారి అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి తమ ఉదారతను చాటుకున్నారు.

వైద్యులు శ్రీ హనుమంతరావు గారిని బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన అనంతరం, ‘జీవన్‌దాన్’ కోఆర్డినేటర్లు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. తీరని శోకంలో ఉన్నప్పటికీ, మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపవచ్చనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో ‘జీవన్‌దాన్’ బృందం సమన్వయంతో సీనియర్ వైద్య నిపుణులు నిర్దేశిత నిబంధనలు, వైద్య మార్గదర్శకాల ప్రకారం అవయవ సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.Guntur District City News

కుటుంబ సభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం అభినందనలు:

ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ… అత్యంత కష్టసమయంలోనూ సమాజ హితం కోసం ఆలోచించి, అవయవదానానికి ముందడుగు వేసిన హనుమంతరావు గారి కుటుంబ సభ్యుల ధైర్యాన్ని, మానవతా దృక్పథాన్ని కొనియాడారు.

డాక్టర్ మమత రాయపాటి మాట్లాడుతూ… “అవయవదానం అనేది మరొకరికి జీవితాన్ని అందించే మహత్తరమైన బహుమతి. హనుమంతరావు గారి కుటుంబ సభ్యుల నిర్ణయం ఎందరికో ఆదర్శం” అని పేర్కొన్నారు.

అవయవదానంపై సమాజంలో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, అవసరంలో ఉన్న బాధితులకు కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ పిలుపునిచ్చింది.

Author
Share This Article
Leave a review