చిన్నగంజాం: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామంలో రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు చేపట్టారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.Bapatla District City News
ఈ కార్యక్రమంలో ఇంకొల్లు సీఐ రామ్ నాయక్, చిన్నగంజాం ఎస్సై సురేష్, ఇంకొల్లు, కారంచేడు ఎస్సైలు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.



