కనిగిరి, అక్టోబర్ 8:– రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం కనిగిరి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, ఎన్నికలకు సంబంధించిన రికార్డులు, శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగానే సేకరించి సిద్ధంగా ఉంచాలని ఎస్పీ సూచించారు. పోలింగ్ కేంద్రాల భవనాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, భద్రతా పరిస్థితులపై సమగ్ర వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
గత ఎన్నికల్లో ఘర్షణలు, వివాదాలు చోటుచేసుకున్న గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అవసరమైన చోట కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.Markapur District News :మార్కాపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను వెంటనే ఏర్పాటు చేయాలి- డాక్టర్ షేక్ మహబూబ్ వలి డిమాండ్
పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూ కేసుల ముద్దాయిలను గుర్తించి చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని, పెండింగ్ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోని ముఖ్య వ్యక్తులు, సున్నిత ప్రాంతాలు, పాత వివాదాలు, భూవివాదాలు, రాజకీయ విభేదాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించాలని పోలీసు అధికారులకు సూచించారు.
సమస్య ఏర్పడిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సమస్యలను గుర్తించి నివారించే విధంగా ప్రివెంటివ్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పంకజ్ కుమార్ మీనా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.



