GUNTUR DISTRICT NEWS: ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్ల స్వీకరణకు సిద్ధం కావాలి

Karthik
1 View

ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్ల స్వీకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు, రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన అధికారులతో ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిబంధనలు పట్ల శత శాతం స్పష్టత కలిగి ఉండాలన్నారు నిబంధనలను తు.చ తప్పక పాటించాలని పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ పత్రాలు సమర్పించుటకు ఎంత మంది వ్యక్తులు రిటర్నింగ్ అధికారి వద్దకు రావచ్చును, నిర్దేశిత రెండు వందల మీటర్ల పరిధి వరకు ఎన్ని వాహనాలను అనుమతించవచ్చును వంటి ప్రాథమిక అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు. ఎన్నికలలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీసీ కెమెరాలను సోమవారం సాయంత్రం నాటికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే అభ్యర్థులకు అవసరమైతే సహాయం అందించుటకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి సంబంధిత సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించే ధ్రువీకరణ, ఇతర పత్రాల చెక్ లిస్టు లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 19వ తేదీన షెడ్యూలు ప్రకటించనుందని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు 21వ తేదీన తమ పరిధిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అన్నారు.రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ సంబంధిత వివరాలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెట్టాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిని ఆదేశించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు, స్వీకరణ (రిసెప్షన్) కేంద్రాల వివరాలు సైతం స్పష్టంగా తెలియజేయాలని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు తదితర అన్ని అంశాలను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, రిటర్నింగ్  అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review