Andhra Pradesh School Education Adhoc Rules 2026: ఏపీ పాఠశాల విద్యాశాఖలో కొత్త సర్వీస్ రూల్స్.. జీవో నంబర్ 35 విడుదల

Rambabu k
5 Views

ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణలో మార్పులు.. నియామకాలు, ప్రమోషన్లు, అర్హతలకు కొత్త నిబంధనలు

నవంబర్ 3న కొత్త జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాలు, పదోన్నతులు, సర్వీసు నిబంధనలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. G.O.Ms.No.35 ద్వారా “ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ అడహాక్ రూల్స్–2026”ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ SER-II విభాగం ఈ ఉత్తర్వులను నవంబర్ 3, 2026న జారీ చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 2, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించనున్నారు.

పాత జీవో స్థానంలో కొత్త నిబంధనలు

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా సర్వీసు నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో అమల్లో ఉన్న G.O.Ms.No.11, తేదీ 23.01.2009 స్థానంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

ఉపాధ్యాయ పోస్టులు రెండు తరగతులుగా విభజన

కొత్త నిబంధనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పోస్టులను క్లాస్–I, క్లాస్–IIగా విభజించారు. క్లాస్–Iలో స్కూల్ అసిస్టెంట్లు, మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, సైకాలజిస్ట్ కోఆర్డినేటర్లు, ELTC ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ వంటి పోస్టులను చేర్చారు.

క్లాస్–IIలో ఎస్జీటీ, ఇతర ఉపాధ్యాయ పోస్టులు

క్లాస్–IIలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, క్రాఫ్ట్, ఒకేషనల్, నేత, కుట్టు ఉపాధ్యాయులు, హిందీ లాంగ్వేజ్ పండిట్ తదితర పోస్టులను చేర్చారు. అయితే PET, హిందీ లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు ఇకపై కొత్త నియామకాలు ఉండవని నిబంధనల్లో పేర్కొన్నారు.

స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో 30:70 నిష్పత్తి

గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 30 శాతం ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మిగిలిన 70 శాతం ఖాళీలను క్లాస్–II కేటగిరీల నుంచి పదోన్నతి లేదా మినిస్టీరియల్ సర్వీస్ నుంచి బదిలీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) నియామక అధికారిగా ఉంటారు.

భాషా ఉపాధ్యాయ పోస్టులకు 70:30 నిష్పత్తి

తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా, 30 శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. వీటికి కూడా జిల్లా విద్యాశాఖాధికారే నియామక అధికారి.

ఎస్జీటీ పోస్టులన్నీ ప్రత్యక్ష నియామకాల ద్వారానే

ఎస్జీటీ, ఇతర స్పెషల్ టీచర్ పోస్టులను పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. సైకాలజిస్ట్ కోఆర్డినేటర్, ఎస్సీఈఆర్టీ ఆర్టిస్ట్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నియామక అధికారిగా వ్యవహరిస్తారు.

స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి.

బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులే

బాలికల పాఠశాలల్లో, ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించిన పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.

టెట్, సీటెట్ తప్పనిసరి

క్లాస్–Iలోని 1 నుంచి 15 కేటగిరీలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు (PET మినహా), అలాగే క్లాస్–IIలోని ఎస్జీటీ పోస్టులకు సంబంధిత టెట్ లేదా సీటెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. సంబంధిత పోస్టులకు నిర్దేశించిన ఇతర విద్యార్హతలను కూడా కలిగి ఉండాలి.

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడీ లేదా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి. గణితం, సైన్స్, సోషల్ వంటి విభాగాల్లో నిర్దేశించిన షరతులకు అనుగుణంగా ఇంజినీరింగ్, బీసీఏ, బీబీఎం అర్హతలు కలిగిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు.

ఎస్జీటీ పోస్టులకు డీఈడీ, డీఎల్‌ఈడీ అర్హత

సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు రెండేళ్ల డీఈడీ లేదా డీఎల్‌ఈడీ, నాలుగేళ్ల బీఈఎల్‌ఈడీ లేదా సంబంధిత స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఉండాలి. బీఈడీ అర్హతతో ఎస్జీటీగా నియమితులైన వారు ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులకు ఆర్‌సీఐ గుర్తింపు

స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) గుర్తింపు పొందిన విద్యార్హతతో పాటు సరైన CRR నంబర్ కలిగి ఉండాలి.

ప్రత్యక్ష నియామకాలకు వయోపరిమితి

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. నోటిఫికేషన్ విడుదలయ్యే సంవత్సరంలో జూలై 1 నాటికి ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ వయోపరిమితిని మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

పదోన్నతులకు కనీసం రెండేళ్ల సర్వీసు

కింది కేటగిరీ నుంచి పై కేటగిరీకి పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకం పొందాలంటే కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి.

ప్రొబేషన్ నిబంధనల్లో మార్పులు

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన వారు మూడేళ్ల వరుస కాలంలో రెండేళ్ల పాటు ఆన్‌డ్యూటీ ప్రొబేషన్ పూర్తి చేయాలి. పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియమితులైన వారు రెండేళ్ల కాలంలో ఏడాది పాటు ఆన్‌డ్యూటీ ప్రొబేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

రెవెన్యూ జిల్లానే నియామక యూనిట్

క్లాస్–I, క్లాస్–II కేటగిరీల్లోని అన్ని పోస్టులకు నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీల కోసం సంబంధిత రెవెన్యూ జిల్లానే యూనిట్‌గా పరిగణించనున్నారు.

ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీపై స్పష్టత

ఎయిడెడ్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విలీనమైన ఉపాధ్యాయుల సీనియారిటీని వారు ప్రభుత్వ పాఠశాలలో విధుల్లో చేరిన తేదీ ఆధారంగా లెక్కించనున్నట్లు కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.

కొత్త సర్వీస్ రూల్స్‌తో ఉపాధ్యాయ నియామకాలు, పదోన్నతులు, సీనియారిటీ, అర్హతల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నిబంధనలు ఉపాధ్యాయులు, ఉద్యోగార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సిటీ న్యూస్ తెలుగు

Author
Share This Article
Leave a review