విజయవాడ:– ప్రజల భద్రతకు, అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం అందించేందుకు విజయవాడ పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు. అమెరికాకు చెందిన నలుగురు పౌరులు పోగొట్టుకున్న విలువైన బ్యాగును కేవలం అరగంట వ్యవధిలోనే గుర్తించి, అందులోని వస్తువులన్నింటినీ క్షేమంగా తిరిగి అందజేసి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రశంసలు అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3వ తేదీ ఉదయం లెమన్ ట్రీ హోటల్ వద్ద అమెరికాకు చెందిన నలుగురు పౌరులు టాక్సీ ఎక్కి నక్కల రోడ్డులో దిగే సమయంలో తమ విలువైన వస్తువులు ఉన్న బ్యాగును కారులోనే మర్చిపోయారు. ఆ బ్యాగులో నాలుగు పాస్‌పోర్టులు, నాలుగు వీసాలతో పాటు ఇటీవల వివాహం చేసుకున్న నూతన దంపతులు మైఖేల్ జాన్సన్, ప్రత్యూషలకు వివాహ కానుకగా వచ్చిన బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన బహుమతులు ఉన్నాయి. అదే రోజు వారు అమెరికాకు ప్రయాణం కావాల్సి ఉండటంతో బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఎం.వి.దుర్గారావు తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాధితులు ప్రయాణించిన టాక్సీని గుర్తించారు. అనంతరం కారు డ్రైవర్‌తో చాకచక్యంగా మాట్లాడి వాహనాన్ని తిరిగి రప్పించారు.
కేవలం అరగంట వ్యవధిలోనే బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని నాలుగు పాస్‌పోర్టులు, నాలుగు వీసాలు, బంగారు ఆభరణాలు, నగదు, ఇతర వివాహ కానుకలను ఎలాంటి నష్టం లేకుండా భద్రంగా నూతన దంపతులకు అందజేశారు.
విజయవాడ పోలీసుల వేగవంతమైన స్పందనకు అమెరికన్ పౌరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ సమస్యను సినిమా తరహాలో అత్యంత వేగంగా పరిష్కరించిన పోలీసుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. అమెరికా పోలీసులు సైతం ఇంత వేగంగా స్పందించరేమోనని వ్యాఖ్యానిస్తూ విజయవాడ సిటీ పోలీసుల సేవలను కొనియాడారు.Vijayawada City News
ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐపీఎస్ స్పందిస్తూ, అత్యంత తక్కువ సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి విదేశీ పౌరుల విలువైన వస్తువులను సురక్షితంగా తిరిగి అందించిన ఇన్స్పెక్టర్ ఎం.వి.దుర్గారావు, ఆయన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల అప్రమత్తత, సమన్వయం, వేగవంతమైన స్పందనకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.



