గుంటూరు, నవంబరు 5:- గుంటూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
గురువారం గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లతో, పోలింగ్ సిబ్బందితో మాట్లాడి పోలింగ్ నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఉదయం 9 గంటల వరకు 6.02 శాతం, ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 724 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.Guntur City News
జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాలకు, 193 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఓటర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



