Vijayawada City News :దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి-దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్‌కు వినతి – నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా

S Sarath
5 Views

విజయవాడ:– ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ జి. నారాయణస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. త్వరలో కొలువుదీరనున్న జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల్లో అర్హులైన దివ్యాంగులకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా షేక్ కాలేషా మాట్లాడుతూ.. 2025 డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది దివ్యాంగుల సమక్షంలో ముఖ్యమంత్రి దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ హామీ దివ్యాంగుల్లో కొత్త ఆశలు, నమ్మకాన్ని కలిగించిందన్నారు.

అయితే 2026 అక్టోబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. ముఖ్యమంత్రి హామీ అమలుకాకపోవడంతో దివ్యాంగుల్లో తీవ్ర ఆవేదన నెలకొందని తెలిపారు. పరిపాలనాపరమైన కారణాలతోనే హామీ అమలు ఆలస్యమై ఉంటుందని భావిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.Vijayawada city News

త్వరలో ఏర్పాటుకానున్న జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల్లో అర్హులైన దివ్యాంగులను గుర్తించి కో-ఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేసేలా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల దివ్యాంగుల సమస్యలు నేరుగా పాలకవర్గాల దృష్టికి వెళ్లడంతో పాటు, వారి హక్కులు, అవసరాలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు.

దివ్యాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం దయాదాక్షిణ్యాలతో ఇచ్చే అవకాశం కాదని, రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల హక్కులో భాగమని స్పష్టం చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016 స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

గతంలోనూ పలుమార్లు ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికైనా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేక చొరవ చూపి ముఖ్యమంత్రి, ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని షేక్ కాలేషా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. సతీష్ పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review