గుంటూరు, నవంబరు 11:- భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, దేశ విద్యావ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా సమాజ అభివృద్ధికి, జాతీయ పురోగతికి ప్రధాన సాధనంగా భావించిన మహనీయుడని కొనియాడారు.
ఆజాద్ అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు తత్వశాస్త్రం, గణితం, ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని అభ్యసించారని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగించేందుకు తన రచనలు, ప్రసంగాలను ఆయుధాలుగా ఉపయోగించారని చెప్పారు. 1912లో ‘అల్ హిలాల్’ ఉర్దూ పత్రికను ప్రారంభించి స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను సమాయత్తం చేశారని వివరించారు.
హిందూ, ముస్లింల ఐక్యతతో పాటు మతాలకు అతీతంగా భారతీయులంతా స్వాతంత్ర్యం కోసం పోరాడాలని ఆజాద్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. పేదలు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేశారని తెలిపారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఆశయంతో పాటు సాంకేతిక, శాస్త్రీయ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.Guntur City News
దేశంలో విశ్వవిద్యాలయాల ప్రమాణాలను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటుకు పునాదులు వేశారని తెలిపారు. భారతీయ కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీల ఏర్పాటుకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని అన్నారు. ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ వంటి రచనల ద్వారా దేశ చరిత్రకు విలువైన సమాచారాన్ని అందించారని పేర్కొన్నారు.
దేశానికి, ముఖ్యంగా విద్యారంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో మరణానంతరం భారతరత్న పురస్కారంతో గౌరవించిందని తెలిపారు. 2008 నుంచి ఆయన జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని వివరించారు.
ఆజాద్ జీవితం దేశభక్తి, విద్య పట్ల అంకితభావం, మతసామరస్యం, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. విద్య ద్వారానే దేశం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన విశ్వసించిన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె. పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.



