మంగళగిరి, నవంబర్ 12: – నవజాత శిశువులకు అందించే వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎఫ్బీఎన్సీ (ఆసుపత్రి ఆధారిత నవజాత శిశు సంరక్షణ) పోర్టల్ వినియోగాన్ని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో చినకాకానిలోని హాయిలాండ్ హోటల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక పునశ్చరణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను పోర్టల్‌లో ఖచ్చితంగా, సకాలంలో నమోదు చేయడం, సమాచార సేకరణ, విశ్లేషణ, పర్యవేక్షణలో వైద్య సిబ్బందికి నైపుణ్యాలు పెంపొందించడం లక్ష్యంగా శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 70 ఆరోగ్య కేంద్రాలకు చెందిన 210 మంది వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, సమాచార నమోదు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగాలు (ఎస్ఎన్సీయూ), నవజాత శిశు స్థిరీకరణ విభాగాల్లో (ఎన్‌బీఎస్‌యూ) పనిచేస్తున్న సిబ్బందికి పోర్టల్ వినియోగంపై అవగాహన కల్పించారు.
శిక్షణ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నవజాత శిశు సంరక్షణ సేవల బలోపేతంలో ఎఫ్బీఎన్సీ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (శిశు ఆరోగ్యం) డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శిశువుల ఆరోగ్య వివరాలను సమగ్రంగా సేకరించి, విశ్లేషించడం ద్వారా వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. యునిసెఫ్ కన్సల్టెంట్ డాక్టర్ విక్రమ్ రెడ్డి వనరుల నిపుణుడిగా పాల్గొని పోర్టల్ వినియోగం, సమాచార నమోదు, సాంకేతిక అంశాలపై శిక్షణ అందించారు.
పోర్టల్ వినియోగంపై ప్రాయోగిక శిక్షణ
శిక్షణలో భాగంగా పోర్టల్‌లోకి ప్రవేశించడం, వినియోగదారుల నమోదు, ఆరోగ్య కేంద్రాల వివరాల నిర్వహణ, నవజాత శిశువుల ఆసుపత్రి చేరిక, డిశ్చార్జి వివరాల నమోదు, వైద్య సేవల సమాచార నమోదు, వివరాల ధ్రువీకరణ, నివేదికల తయారీ, డ్యాష్‌బోర్డు వినియోగం, పనితీరు పర్యవేక్షణ వంటి అంశాలను వివరించారు. సిబ్బంది స్వయంగా పోర్టల్‌ను వినియోగించేలా ప్రాయోగిక శిక్షణ కూడా ఇచ్చారు.
వైద్య సేవల నాణ్యత పెంపునకు దోహదం
ఎఫ్బీఎన్సీ పోర్టల్ ద్వారా ఎస్ఎన్సీయూ, ఎన్‌బీఎస్‌యూ విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వైద్య సేవల్లో ఉన్న లోపాలను గుర్తించి, అవసరమైన నాణ్యతా మెరుగుదల చర్యలు చేపట్టేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.Guntur City News
ఈ శిక్షణతో రాష్ట్రంలో నవజాత శిశు సంరక్షణ సేవల పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వైద్య సేవల నాణ్యత పెంపు, నవజాత శిశు మరణాలు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఎఫ్బీఎన్సీ పోర్టల్ దోహదపడనుంది.



