గుంటూరు, నవంబర్ 13:- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి మరింత స్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఆర్.టి.జి.ఎస్. హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.Guntur City News
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. తుపాను పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉంచుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు.



